: బతకడని వైద్యులు తేల్చేస్తే... ఇప్పుడు నిక్షేపంలా వున్నాడు!
ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటికి వస్తూ... 'బతకడం కష్టం...అయినా మా ప్రయత్నం మేం చేస్తాం...ఇక భగవంతుడే దిక్కు'... ఈ డైలాగు తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం. అయితే, అమెరికాలోని ఫ్లోరిడాలో బ్రాండన్, బ్రిట్టానీ దంపతులకు కూడా 13 నెలల క్రితం అక్కడి వైద్యులు ఇవే డైలాగులు చెప్పారు. ఎందుకంటే జాక్సన్ పుట్టాడు. పుర్రె పూర్తి స్థాయిలో లేని కారణంగా అతని మెదడు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, బతికే అవకాశాలు చాలా తక్కువని, మహా బతికితే కొన్ని వారాల పాటు బతకొచ్చని స్పష్టం చేశారు. దీంతో తొలుత ఆందోళన చెందిన జాక్సన్ తల్లిదండ్రులు, బతికినంత కాలం ఆనందంగా పెంచుదామని నిర్ణయించుకున్నారు. అయితే వైద్యుల అంచనాను తల్లకిందులు చేస్తూ, జాక్సన్ ఇప్పుడు మొదటి పుట్టిన రోజు జరుపుకున్నాడు. తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు కూడా. అందుకే, అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి... 'గాడ్ ఈజ్ గ్రేట్' అంటూ జీసస్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.