: అభిమానుల ప్రవర్తనపై దర్యాప్తుకు ఆదేశం
భారత్-సౌతాఫ్రికా మధ్య కటక్ లో జరిగిన రెండో టీట్వంటీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ఒడిశా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అభిమానుల ప్రవర్తనపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక నెల రోజుల్లో అందజేయాలని హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. మ్యాచ్ జరుగుతుండగా, ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఒడిశా అభిమానులు ఆగ్రహంతో ఆకతాయిల్లా ప్రవర్తించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరి ఆటకు అంతరాయం కలిగించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయితనంతో దేశానికి చెడ్డపేరు తెస్తున్నారని కొంత మంది మండిపడగా, ప్రత్యర్థి పటిష్ఠమైన సౌతాఫ్రికా అని, అద్భుతమైన ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ కలిగిన జట్టని కూడా ఇంగితం లేకపోతే ఎలా? అని పలువురు నెటిజన్లు కటక్ అభిమానులను ప్రశ్నిస్తున్నారు.