: బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఐఏఎస్ అరెస్టు
లైంగిక వేధింపుల ఆరోపణలపై ఛత్తీస్ గఢ్ లో ఒక ఐఏఎస్ అధికారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖర్సియా ప్రాంతానికి ఐఏఎస్ అధికారి ఏకే ధ్రిత్లారే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా వున్నప్పుడు తన అధికారిక నివాసంలో పదహారు సంవత్సరాల బాలిక పనిచేసేది. ఆ సమయంలో ఆ బాలికపై ఆయన పలుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో, గత జూన్ 15వ తేదీన రాయ్ గఢ్ కలెక్టర్, ఎస్పీలకు బాధిత బాలిక ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు అధికారులతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. తమ విచారణలో తెలిసిన సమాచారం అనుసరించి ధ్రిత్లారే ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, 25 వేల పూచీకత్తుపై సదరు ఐఏఎస్ కు ఛత్తీస్ గఢ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు.