: ఫోటోలు తీస్తాయి, రికార్డు చేస్తాయి... అన్నీ మీకు తెలియకుండానే!: 'బాంబే'సిన ఎడ్వర్డ్ స్నోడెన్
బ్రిటన్ గూఢచార వర్గాలు తలచుకుంటే ప్రపంచంలోని ఏ స్మార్ట్ ఫోన్ లోకి అయినా ప్రవేశించి ఆడియోలు రికార్డు చేయగలరని, యజమానులకు తెలియకుండానే ఫోటోలు తీసుకుని వాటిని తమ వద్దకు రప్పించుకోగలరని ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం 'స్ముర్ఫ్ సూట్' అనే టూల్ ను నిఘా వర్గాలు వాడుతున్నాయని, దీని సహాయంతో వారు అత్యంత సులువుగా తమకు కావాల్సిన ఫోన్ లోకి ఒక్క మెసేజ్ ని పంపి చొచ్చుకెళ్తున్నారని ఆరోపించారు. కాగా, అమెరికా ప్రభుత్వం స్నోడెన్ పై గూఢచర్య ఆరోపణలతో కేసులు పెట్టిన తరువాత ఆయన వివిధ దేశాలు తిరుగుతూ, ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. "మీ ఫోన్లకు యజమానులుగా మీ బదులు వారు ఉండాలనుకుంటున్నారు" అని బీబీసీ పనోరమా కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నోడెన్ తెలిపారు. ఈ దిశగా బ్రిటన్ జీసీహెచ్ క్యూ (గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్) ఏజన్సీ విజయం సాధించిందని తెలిపారు. స్ముర్ఫ్ (నీలి రంగులో ఉండే ఓ కార్టూన్ క్యారెక్టర్)లో పలు రకాలున్నాయని, 'నోసీ స్ముర్ఫ్' వాడితే స్మార్ట్ ఫోన్లోని మైక్రోఫోన్ దానంతట అదే ఆన్ అవుతుందని, దీంతో పాటు 'ట్రాకర్ స్ముర్ఫ్', 'డ్రీమీ స్ముర్ఫ్' వంటి వాటితో ఎక్కడున్నారన్న విషయం తెలియడంతో పాటు, ఫోన్ ను దానంతట అదే ఆన్, ఆఫ్ అయ్యేలా చేయవచ్చని వివరించారు. ఈ సంగతులేవీ ఫోన్ యజమానికి తెలియకుండానే జరిగిపోతాయని తెలిపారు.