: ఇరాక్ రాజధానిపై మరోసారి విరుచుకుపడ్డ ఐఎస్ఐఎస్
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. షైతే వర్గం ముస్లింలు అధికంగా ఉన్న అల్ ఖలేస్ ప్రాంతంలో మూడు చోట్ల కారు బాంబులను నిలిపి వాటిని ఒకే సమయంలో పేల్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 36 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 60 వరకూ ఉండవచ్చని స్థానికులు తెలిపారు. హుస్సేనియా, అల్ ఖలేస్, బాస్రా ప్రావిన్స్ ప్రాంతాల్లోని రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఈ పేలుళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తమ విద్రోహ చర్యల్లో భాగంగా, ఆత్మాహుతి దాడులకు సైతం ఉగ్రవాదులు వెనుకాడటం లేదు. దీంతో వేల సంఖ్యలో ప్రజలు ఇరాక్, సిరియా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళుతున్న సంగతి తెలిసిందే.