: కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలో క్రమబద్ధీకరిస్తాం: మంత్రి ఈటెల
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారని తెలిపారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, దాని ద్వారా 2 కోట్ల 82 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్టు ఈటెల వివరించారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేశామన్నారు. నవంబర్, డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇక తండాల్లో కూడా రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఈటెల తెలియజేశారు.