: ‘ఎర్ర’ దొంగలు యాసిడ్ దాడి చేస్తారు జాగ్రత్త!... అటవీ, పోలీసు సిబ్బందికి అధికారుల హెచ్చరిక
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం భారీ ఎత్తున విదేశాలకు తరలివెళుతోంది. అయితే విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు అటవీ శాఖతో పాటు పోలీసు శాఖ విశ్వయత్నం చేస్తున్నా, ఈ దందా ఆగడం లేదు. ఎర్రచందనం అక్రమ తరలింపునకు సంబందించి ఒక్క దొంగ పట్టుబడితే, అదే రోజు మరో ఇద్దరు రంగంలోకి దిగుతున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దశాబ్దానికిపైగా ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ అనుచరులను రంగంలోకి దించిన స్మగ్లర్లు యథేచ్ఛగా ఎర్రచందనాన్ని దోచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. పోలీసు, అటవీ శాఖలతో కలిపి తిరుపతి కేంద్రంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అయినా ఎర్రచందనం అక్రమ రవాణా ఆగలేదు. తమను అడ్డుకునేందుకు వస్తున్న పోలీసులపై తమిళ కూలీలు (వీరప్పన్ అనుచరులు) దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో అటవీ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందికి తాజాగా ఓ సందేశం పంపారు. తమిళ కూలీలు యాసిడ్ దాడులకు కూడా దిగే ప్రమాదముందని, మరింత జాగ్రత్తగా ఉండాలని ఆ సందేశంలో హెచ్చరించారు.