: ఆరుషి తల్వార్ కేసులో కొత్త ట్విస్ట్... తల్లిదండ్రులను ఇరికించారంటున్న సీబీఐ అధికారి


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్యకేసులో, దోషులుగా ముద్రపడి జైలు శిక్షను అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు నిర్దోషులని ఈ కేసును మొట్టమొదట విచారించిన సీబీఐ అధికారి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన జాయింట్ డైరెక్టర్, ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్, "నేను ఈ అభిప్రాయానికి రావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది హేమరాజ్ మృతదేహం ఆరుషి మృతదేహంతో పాటే లభించలేదు. ఈ కేసులో ఫోరెన్సిక్ నమూనాల సేకరణ జరగలేదు. అదే జరిగివుంటే నిజం ఎంతో సులభంగా వెల్లడయ్యుండేది" అన్నారు. "ఈ కేసును విచారించిన రెండు సీబీఐ టీమ్ లూ ఒకే మాటపైకి రాలేదు. ఒక టీం ఆరుషిని హత్య చేసేందుకు వారి తల్లిదండ్రులు సహకరించారని చెప్పగా, రెండో టీమ్, పనివాడు హేమరాజ్ తో కలసి ఉన్న ఆరుషిని చూసిన తరువాత, వారే హత్య చేశారని చెప్పారు" అని అన్నారు. సీబీఐ డైరెక్టర్ అశ్వని కుమార్ కేసు బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి మొత్తం మారిపోయిందని ఆయన ఆరోపించారు. డైరెక్టర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే కేసు తప్పుదారి పట్టిందా? అన్న ప్రశ్నకు అరుణ్ కుమార్ సమాధానం ఇవ్వలేదు. కేసు విచారణను ముగించే సమయంలో తనను అభిప్రాయం కోరారని, "ఈ నేరంలో ఆరుషి తల్లిదండ్రులకు సంబంధమున్నట్టు ఒక్క ఆధారం కూడా లేదు" అని తాను స్పష్టం చేసినా ఎవరూ వినలేదని అరుణ్ ఆరోపించారు. కాగా, ఈ కేసు ఆధారంగా నిర్మితమై ఇటీవల విడుదలైన 'తల్వార్' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా, అరుణ్ కుమార్ పాత్రను ఇర్ఫాన్ ఖాన్ పోషించాడు. సినిమాలో ఆయన చెప్పిన డైలాగులే ఇప్పుడు అరుణ్ కుమార్ నోటివెంట రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News