: ముగ్గురు విద్యార్థులు.. ఓ అధ్యాపకురాలు: ఇదీ ‘రాజు’గారి పూర్వీకుల కళాశాల దుస్థితి


విజయనగరం మహారాజులు ఏర్పాటు చేసిన కళాశాల విద్యార్థులను ఆకట్టుకోలేకపోతోంది. 155 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అలాగని ప్రభుత్వమేమైనా ఈ కళాశాలను పట్టించుకుంటోందా అంటే, అదీ లేదు. వెరసి దక్షిణ భారత దేశంలోనే అతి పురాతన కళాశాలల్లో ఒకటిగా రికార్డులకెక్కిన ‘ఎంఆర్ కాలేజ్ ఆఫ్ సాంస్క్రిట్ ఆఫ్ విజయనగరం’ కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. వివరాల్లోకెళితే... 1860లో అప్పటి విజయనగరం మహారాజులు (ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు పూర్వీకులు) ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. తదనంతరం 1950లో ఈ కళాశాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కళాశాలను రెండుగా విభజించి సాంస్క్రిట్ హై స్కూల్, ఎంఆర్ కాలేజ్ ఆఫ్ సాంస్క్రిట్ ఆఫ్ విజయనగరంలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం స్కూల్ లో 371 మంది విద్యార్థులు, 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ స్కూల్ కు ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకు భిన్నంగా కళాశాలకు మాత్రం ఏటేటా ఆదరణ కరవవుతోంది. ప్రస్తుతం కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ఉండగా, వారి విద్యాబోధన కోసం ఒకే ఒక్క అధ్యాపకురాలు ఉన్నారు. అధ్యాపకురాలిగానే కాక కళాశాల ప్రిన్సిపాల్ గానూ ఆమె రెండు బాధ్యతలను భుజానేసుకున్నారు. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఇంటిగ్రేటెడ్ సాంస్క్రిట్ కోర్సుకు విద్యార్థుల నుంచి అంతగా స్పందన రావడం లేదు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. ఈ కారణంగానే ఈ కాలేజీ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులకు విద్యార్థుల నుంచి ఆదరణ కరవైందని ప్రిన్సిపల్ కమ్ లెక్చరర్ స్వప్న హైందవి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News