: 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' నాటకాన్ని నిలిపివేయాలి: క్రైస్తవ సంఘాల వినతి


వివాదాస్పద నాటకం 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్'ని నిలిపివేయాలంటూ పలు క్రైస్తవ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతిపత్రం సమర్పించాయి. ఈ విషయమై మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, సంబంధిత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. కాగా, నాటక కథాంశం క్రైస్తవ సన్యాసినులను కించపరిచే విధంగా ఉందని క్రైస్తవ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సన్యాసినిగా మారిన ఒక యువతి అనూహ్య రీతిలో బిడ్డకు జన్మనిచ్చే కథాంశంతో ఆగ్నెస్ ఆఫ్ గాడ్ నాటకాన్ని రూపొందించారన్నారు. ఒక ప్రముఖ సంస్థ ఈ నాటకాన్ని ముంబైలో ఈ రోజు నుంచి ప్రదర్శించనుంది. ఆగ్నెస్ ఆఫ్ గాడ్ నాటక రచయిత అమెరికాకు చెందిన జాన్ హెల్మెర్. 80వ దశకంలో దీనిని రూపొందించారు. న్యూయార్క్ లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగానే ఈ నాటకాన్ని జాన్ రాశారని ప్రచారంలో ఉంది. ఈ నాటకం ఆధారంగా అదే పేరుతో 1985లో రిలీజైన హాలీవుడ్ చిత్రం పలు అవార్డులను కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News