: మానవత్వం పరిమళించింది... దేవాలయ ప్రాంగణంలో ముస్లిం యువతికి ప్రసూతి సేవ చేసిన హిందూ మహిళలు!
‘కులాలు, మతాలతో మాకు సంబంధం లేదు..మానవత్వమే మా మతం’ అంటున్నారు ముంబయి మహిళలు. వడాలా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనే వారి మాటలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒక స్థానిక పత్రిక కథనం ప్రకారం.. రోడ్డుపై పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక ముస్లిం మహిళను పక్కనే ఉన్న గుడి ఆవరణలోకి తీసుకెళ్లి ఆమె ప్రసవానికి హిందూ మహిళలు సహకరించారు. ముంబయికి చెందిన ఇల్యాజ్ షేక్ తన భార్య నూర్జహాన్ ను కారులో ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. కారులో కాన్పు జరగడం ఇష్టం లేని కారు డ్రైవర్ వాళ్లిద్దరినీ మార్గమధ్యంలోనే దించివేశాడు. ఈ సంఘటనను అక్కడి వినాయకుడి గుడి దగ్గర కూర్చున్న కొందరు మహిళలు చూశారు. వెంటనే ఈ దంపతుల దగ్గరకు వచ్చారు. నూర్జహాన్ ను గణేశ్ గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. కొన్ని చీరలతో చిన్న గది లాగా కట్టి నూర్జహాన్ ప్రసవానికి సహకరించారు. పండంటి మగబిడ్డను ప్రసవించింది. తన బిడ్డను చూసి తల్లి మురిసిపోయింది. అనంతరం వాళ్లిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. ‘గణేశ్ గుడిలో నా బిడ్డ పుట్టాడు..ఇంత కన్నా అదృష్టమేముంటుంది, కనుక ఆ దేవుడి పేరే నా బిడ్డకు పెడతాను’ అని నూర్జహాన్ చెప్పింది.