: ఆవు ఎవరికీ 'మాత' కాదు... మరో జంతువు మాత్రమే: మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్య
గోవు ఎవరికీ తల్లి వంటిది కాదని, కేవలం మరో జంతువు మాత్రమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తిన్నాడని ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. బనారస్ హిందూ యూనివర్శిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో కట్జూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "ఆవు ఒక జంతువు మాత్రమే. ఒక జంతువు ఎవరికీ తల్లి కాదు. నాకు గొడ్డు మాంసం తినడం ఇష్టమైతే, అది ఎవరికీ హాని కాదుకదా? ప్రపంచం నలుమూలలా ఈ మాంసాన్ని తింటూనే వున్నారు. మీకు తినడం ఇష్టమైతే, మిమ్మల్ని ఆపేదెవరు?" అని ఆయన అన్నారు. "ప్రపంచంలో గోమాంసం తినేవారంతా చెడ్డవారని, అది తినని మనం సాధుసంతులమని, మంచివారమని చెప్పగలరా? నేను బీఫ్ (గొడ్డు మాంసం) తింటాను, ఇకపై కూడా తింటూనే ఉంటాను" అని ఆయన అన్నారు. కేవలం పుకార్ల వల్లనే వ్యక్తిపై దాడి జరపడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కట్జూ, హిందువులు పవిత్రంగా పూజించే గోవులపై చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి దుమారాన్ని రేపుతాయో?!