: ఇంతవరకూ చూడని టెక్ మోసం... ఫ్లిప్ కార్ట్ ను 200 సార్లు మోసగించిన హైదరాబాదీ!


ఒకవైపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తుంటే, దాన్నే వినూత్నంగా వాడుతూ మోసగాళ్లు కనీ వినీ ఎరుగని మోసాలకు పాల్పడుతున్నారు. తాాగా ఓ హైదరాబాదీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ను 200 సార్లు మోసగించాడు. సుమరు రూ. 20 లక్షలకు పైగా డబ్బు దోచుకున్నాడు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో సంస్థ ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... ఫ్లిప్ కార్ట్ సంస్థ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింతగా చూరగొనేలా 'ప్లెక్సిబుల్ రిటర్న్ పాలసీ'ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తువు నచ్చకున్నా, ఏదైనా లోపం గుర్తించినా నియమిత సమయంలోపు దాన్ని వెనక్కిచ్చేస్తే, వెంటనే ఆ డబ్బు వాపస్ చేయబడుతుంది. ఎందుకు, ఏమిటి? అని ప్రశ్నించడం ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకుని వీరాస్వామి అనే యువకుడు కొత్త ఆలోచన చేశాడు. తన కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు వారి పేర్లతో పలు వస్తువులకు ఆర్డర్ ఇచ్చేవాడు. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసి ఆపై, అవి నాసిరకంగా ఉన్నాయంటూ, నకిలీ ఉత్పత్తులను వెనక్కు పంపుతుండేవాడు. ఈ వస్తువులు ఫ్లిప్ కార్ట్ కు చేరగానే వీరాస్వామి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుండేది. ఈ తతంగం గత 20 నెలలుగా జరిగింది. దాదాపు 200కు పైగా ప్రొడక్టులను కొన్న వీరాస్వామి వాటిని వెనక్కు పంపడం ద్వారా రూ. 20 లక్షలు స్వాహా చేశాడు. ఇతను మోసం చేసిన తీరు పోలీసులనే అబ్బుర పరిచింది. ఆన్ లైన్ వ్యాపార విధానంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటువంటి కేసు నమోదవడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News