: ఐఫోన్లపై ఉన్న క్రేజ్ ఆ యువకులను కటకటాల్లోకి నెట్టింది!
కొత్తగా ప్రపంచ మార్కెట్లోకి విడుదలై సూపర్ హిట్టయిన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లపై ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని భావించిన ఏడుగురు యువకులు కస్టమ్స్ అధికారులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల నుంచి వివిధ విమానాల్లో వచ్చిన ఏడుగురు యువకుల వద్ద నుంచి 182 యాపిల్ కొత్త తరం ఫోన్లను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు స్వాధీనం చేసుకుని వీరిని పోలీసులకు అప్పగించారు. వీరు భారీ ఎత్తున ఐఫోన్లను విదేశాల్లో కొనుగోలు చేసి ఇండియాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో తాము సోదాలు జరిపినట్టు ఐజీఐ ఎయిర్ పోర్టు కస్టమ్స్ విభాగం అదనపు కమిషనర్ వినాయక్ ఆజాద్ వెల్లడించారు. వీరంతా 20 సంవత్సరాల లోపు యువకులేనని, వీటిని దేశంలోకి తెస్తే డబ్బిస్తామని వచ్చిన ఆఫర్ నమ్మి ఈ పని చేశామని తెలిపారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, వీరి వెనకున్న గ్యాంగ్ గురించి ఆరా తీస్తున్నామని వివరించారు. కాగా, ఈనెల 16న ఐఫోన్లు భారత్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.