: చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు: జానారెడ్డి
తెలంగాణ శాసనసభలో విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జానా మాట్లాడుతూ, శాసనసభలో రైతు సమస్యలపై రెండు రోజుల చర్చ జరిగినా పరిష్కారం దొరకలేదని అన్నారు. రుణమాఫీ రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై అడిగినందుకే సభ్యుల్ని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకని ఒకేసారి రుణమాఫీ చేసేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు.