: ఫలించిన టీటీడీ మంత్రాంగం... తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమలలో రద్దీని తగ్గించడానికి టీటీడీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారాంతపు సెలవు నేపథ్యంలో రెండు లక్షలకు పైగా భక్తులు నిన్న కొండపైకి చేరుకోవడం, ఆపై భారీ వర్షంతో భక్తుల ఇబ్బందుల నేపథ్యంలో టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వర్షం తగ్గిన తరువాత మహా లఘు దర్శనం ఏర్పాటు చేసి వేగంగా భక్తులకు దర్శనం చేయించడంతో పాటు ఈ ఉదయం నుంచి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల జారీని రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. ఇదే సమయంలో ప్రత్యేక బస్సులు నడిపి భక్తులు సులువుగా కొండ దిగి తిరుపతికి చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మధ్యాహ్నానికి రద్దీ తగ్గింది. ప్రస్తుతం సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు ఉన్నారు. వీరికి మరో ఆరు గంటల్లో దర్శనం పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. నడకదారి భక్తులకు 4 గంటల్లో దర్శనం చేయిస్తామని తెలిపింది.