: అమెరికాపై వెల్లువెత్తుతున్న విమర్శలు!
ఆఫ్గనిస్థాన్ లో రద్దీగా ఉన్న ఆసుపత్రిపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా వైఖరిని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. శనివారం నాడు కుందుజ్ ప్రాంతంలో ఈ దాడి జరుగగా, ఆసుపత్రి వైద్యులు, రోగులు సహా 19 మంది మృత్యువాత పడ్డారు. దీన్ని దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించిన అమెరికా సైన్యం ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించగా, తప్పెక్కడ జరిగిందన్న విషయమై పూర్తి విచారణను పారదర్శకంగా జరపాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. పౌరుల ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించిన యూఎన్ అధ్యక్షుడు బాన్ కీ మూన్, యూఎస్ పై ఆఫ్గన్ ప్రజల నమ్మకాన్ని చెరుపుకోరాదని సూచించారు. తాము ప్రజలకు ముప్పుగా మారిన వారిని లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిపామని, అయితే, సమీపంలోనే ఉన్న ఆసుపత్రిపై బాంబులు పడ్డాయని సైన్యం వివరించింది. కాగా, యూఎస్ ఏసీ-130 గన్ షిప్ తో ఈ దాడి జరిగినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సైన్యాధికారి ఒకరు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. అమెరికా చర్యలను పలు దేశాలు ఖండించాయి.