: పర్యాటకుల కోసమట... 100 విదేశీ బ్రాండ్ల మద్యం తెప్పించే వారికి కేసీఆర్ సర్కారు ఆహ్వానం!
కనీసం 100 రకాల విదేశీ మద్యం బ్రాండ్లను తీసుకు రాగలిగిన వారికి ప్రత్యేక 'ఫారిన్ లిక్కర్ బొటీక్స్' ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. హైదరాబాదుకు వచ్చే విదేశీ పర్యాటకులు, ప్రముఖులకు ఫారిన్ లిక్కర్ అందుబాటులో ఉండటం లేదని ఇటీవలి ఎక్సైజ్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ఎక్సైజ్ శాఖ జంటనగరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన మద్యం అందుబాటులో లేదని తేల్చింది. స్కాట్ లాండ్ లో తయారయ్యే జానీ వాకర్ మాత్రమే ఎక్కువగా లభిస్తున్నదని టీఎస్ బీసీఎల్ అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే, 'ఫారిన్ లిక్కర్ బొటీక్స్' ఆలోచన తెరపైకి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, 11 గంటల వరకు బార్లను తెరచి ఉంచుతున్నారు. వీటి సమయాలను కూడా మరింతగా పెంచాలని టీఎస్ ఎక్సైస్ శాఖ భావిస్తూ, ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. కాగా, కనీసం 100 విదేశీ బ్రాండ్లను తేగలిగితే, రెండేండ్ల కాలపరిమితితో బొటీక్ నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేయాలన్నది అధికారుల ప్రతిపాదన.