: ఇదేమైనా యూరప్పా? కులాలు ఉండే తీరుతాయి!: శరద్ యాదవ్
"కులాలు లేకుండా పోవడానికి ఇదేమైనా యూరప్ అనుకుంటున్నారా? ఇక్కడ కులాలు, కుల రాజకీయాలు ఉండి తీరుతాయి" అని జనతాదళ్ (యునైటెడ్) నేత శరద్ యాదవ్ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. బీజేపీ కేంద్ర మంత్రులంతా బీహార్ లో మకాం వేసి ప్రచారాన్ని నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. పాటలీపుత్రం (ఇప్పటి పాట్నా) ఒకప్పటి భారత రాజధానని గుర్తు చేసిన ఆయన, నేతలంతా ఇక్కడికి వచ్చి మకాం వేయడంతో పాట్నా మరోసారి భారత రాజధానిగా మారిందని శరద్ యాదవ్ అన్నారు. బీహార్ లో పగ్గాలు చేపట్టాలన్న వారి కల నెరవేరదని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని తెలిపిన ఆయన, ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీజేపీ 'కుల రాజకీయాలు' అన్న పదాన్ని తరచూ వినియోగిస్తున్నదని, బీహారేమీ యూరప్ కాదని, పలు కులాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చడమే 'జంగిల్ రాజ్'కు నిదర్శనమని, అప్పట్లో ఈ ఆటవిక రాజ్యాన్ని నడిపింది ఎవరో అందరికీ తెలుసునని శరద్ యాదవ్ అన్నారు.