: ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలని సైన్యం కుట్ర... 1987 నాటి ఘటనను వెల్లడించిన మాజీ సైన్యాధికారి
రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఇండియాలో సైనిక పాలన తీసుకురావాలని 1987లో సైన్యం ప్రయత్నించిందని మాజీ సైన్యాధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం 86 సంవత్సరాల వయసులో ఉన్న మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, అప్పట్లో వెస్ట్రన్ కమాండ్ కు అధిపతిగా ఉన్న పీఎన్ హూన్ ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీని హస్తగతం చేసుకునేందుకు బయలుదేరాలని తమకు పిలుపు అందిందని తెలిపారు. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, ఆర్మీ చీఫ్ కష్ణస్వామి సుందర్ జీ, లెఫ్టినెంట్ జనరల్ ఎస్ ఎఫ్ రోడ్రిగ్యూస్ ఈ కుట్ర వెనుక ఉన్నారని తెలిపారు. ఈ మేరకు 'ది అన్ టోల్డ్ ట్రూత్' పేరిట ఆయనో పుస్తకాన్ని రాశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక నిరసనలపై రాజీవ్ సరిగ్గా స్పందించలేదని అన్నారు. మూడు పారా-కమాండో బెటాలియన్లతో తమను ఢిల్లీకి రావాలని ఆర్మీ అధికార కార్యాలయం నుంచి మే, 1987లో తమకు ఆదేశాలు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని తాను రాజీవ్ గాంధీ, అప్పటి ముఖ్య కార్యదర్శి గోపీ అరోరాకు వెల్లడించానని, సైన్యం ఢిల్లీకి రావడం ఎంత ప్రమాదమో తెలిపానని, తన ఆదేశాలు లేకుండా వెస్ట్రన్ కమాండ్ సైన్యం ఢిల్లీకి రావడానికి వీల్లేదని తేల్చి చెప్పానని ఆ పుస్తకంలో వివరించారు. ఇదే పుస్తకం చాప్టర్-10లో 'జ్ఞానీ జైల్ సింగ్ వర్సెస్ రాజీవ్ గాంధీ' అంటూ, రాజీవ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వీసీ శుక్లాకు ఈ సైనికచర్య గురించి సమాచారం ఉందని, తాను ఆ సమయంలో ఢిల్లీలో ఉండగా, తనను కలిసేందుకు శుక్లా వచ్చారని తెలిపారు. అయితే, అప్పటి రాష్ట్రపతి దీన్ని గట్టిగా వ్యతిరేకించడంతో సైన్యం చర్యలన్నీ ఆగిపోయాయని తెలిపారు.