: అంగారక గ్రహంపై ఇళ్లు ఇలా ఉంటాయి
అంగారకుడిపై జీవం ఉందన్నది శాస్త్రవేత్తల ప్రగాఢమైన నమ్మకం. దానిని బలపరుస్తూ నాసా, ఇస్రో అంగారకుడిపై చేసిన పరిశోధనల్లో నీటి జాడలు కనుగొన్నాయి. దీంతో వారి నమ్మకం మరింత బలపడింది. ఎప్పటికైనా మనిషి అంగారకుడిపై కాలుపెడతాడని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై మనిషి ఎలాంటి ఇంట్లో నివసిస్తే బాగుంటుందంటూ ఓ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో 'స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఆర్కిటెక్చర్ అండ్ క్లౌడ్' అనే సంస్థ తయారు చేసిన 'మార్స్ ఐస్ హౌస్' డిజైన్ కు మొదటి బహుమతి వచ్చింది. ఈ 'ఐస్ హౌస్' డిజైన్ లో ఇల్లు పొరలు పొరలుగా ఉంటుంది. కాస్మిక్ కిరణాల వల్ల మనిషి, ఇంటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఈ ఇంట్లోనే డోమ్ వంటి మరో నిర్మాణం ఉంటుంది. ఇందులో స్పేస్ సూట్ లేకుండా మామూలుగా ఉండవచ్చు. దీనిలో ఉండే ఫ్రంట్ యార్డ్ లో పచ్చని మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి మానవుడికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తాయి. ఈ ప్రాజెక్టులో స్పేస్ సైంటిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్, జియాలజిస్ట్, 3డీ ప్రింటింగ్ ఇంజనీర్స్ పాలుపంచుకున్నారు. రోవర్ల సాయంతో అంగారక గ్రహంపై ఈ ఇంటిని నిర్మిస్తారు. కాగా, అంగారకుడిపై లభించే రాళ్లు, ఇసుకతో కూడా ఇళ్లు నిర్మించుకోవచ్చనే కాన్సెప్ట్ కి రెండో బహుమతి లభించింది.