: సైకో ‘సూదిగాడు’ బెదిరిపోయాడు... సిరంజి దాడికొచ్చి జనాన్ని చూసి పరారైన వైనం
నిన్నటిదాకా చేతిలో సిరంజితో బైక్ పై వచ్చి కళ్లు మూసి తెరిచేలోగానే సూది మందు గుచ్చి పరారవుతున్న ‘సైకో ‘సూదిగాళ్లు’ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలను ఈ తరహా సైకోలు బెంబేలెత్తించారు. ఆ రెండు జిల్లాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. మొట్టమొదటి సారిగా ఆ సైకో భయపడ్దాడు. జనాన్ని చూసి పరుగులు పెట్టాడు. గుంటూరు జిల్లా బాపట్లలో నేటి ఉదయం కళాశాలకు వెళుతున్న ఇంటర్ విద్యార్థి కృష్ణపై సైకో సూదిగాడు దాడికి యత్నించాడు. బైక్ పై దూసుకువచ్చిన సైకో, కృష్ణ చేతిపై సిరంజి దాడి చేసేందుకు యత్నించాడు. అయితే అదే సమయంలో అక్కడ గుమిగూడిన జనాన్ని చూసి బెంబేలెత్తాడు. సిరంజిని పడేసి, వచ్చిన వేగంతోనే బైక్ పై పలాయనం చిత్తగించాడు. బైక్ పై వేగంగా దూసుకువచ్చి, అంతే వేగంతో అదృశ్యమైన సైకోను చూసి కృష్ణ బెదిరిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సైకో కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.