: గాయకుడిపై కరెన్సీ నోట్లు గుమ్మరించిన గుజరాత్ బీజేపీ నేత
పట్టలేనంత సంతోషంతో గుజరాత్ లోని వడోదర జిల్లా బీజేపీ అధ్యక్షుడు సతీష్ పటేల్ ఓ గాయకుడిపై కరెన్సీ నోట్లు గుమ్మరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు ఓ వీడియో ద్వారా నెట్లో హల్ చల్ చేస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీన వడోదరలోని హర్నీ ప్రాంతంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రముఖ గాయకుడు కీర్తిదాస్ గద్వీ చేత కచేరీ నిర్వహించారు. ఈ సమయంలో ఒక్కసారిగా వేదికపైకి వచ్చిన సతీష్ పటేల్ ఆయన పాటలు ఆలపిస్తుండగా బకెట్ లో నింపిన కరెన్సీ నోట్లను గుమ్మరించారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిన డబ్బునే గాయకుడిపై ప్రశంసాపూర్వకంగా గుమ్మరించానని చెప్పారు. అదంతా ప్రజలు ఇచ్చిందేనని, అందులో మొత్తం రూ.30 నుంచి రూ.40వేల దాకా ఉంటుందని తెలిపారు. ఈ డబ్బును ఆవుల సంరక్షణ, వాటి సంక్షేమం వంటి సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిస్తామని తెలిపారు.