: బార్కస్ యువకుల కత్తుల యుద్ధం...జట్కాబండి కోసం జరిగిన పోట్లాటలో ఒకరి మృతి
పాతబస్తీలో రౌడీ షీటర్ల స్వైర విహారం కొత్తేమీ కాదు. ఇటీవల అక్కడ జరిగిన స్ట్రీట్ ఫైట్ లో ఓ నవ యువకుడు నడిరోడ్డుపైనే కుప్పకూలాడు. ఈ ఘటన హైదరాబాదును కుదిపేసింది. అంతేకాక అప్పుడెప్పుడో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీపై ఆయన ప్రత్యర్థులు పట్టపగలే కత్తులు, పిస్టళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా, ఓ యువకుడు మాత్రం మరణించాడు. తాజాగా నిన్న రాత్రి బాలాపూర్ లో బార్కస్ కు చెందిన యువకులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. జట్కాబండి విషయంలో తలెత్తిన చిన్న వివాదంలో అలీ అఫ్సారీ, సాదిక్ అనే ఇద్దరు యువకులు మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన ఇబ్రహీంపై కత్తులతో దాడికి దిగారు. వెనువెంటనే అప్రమత్తమైన ఇబ్రహీం కూడా వారిని తన వద్ద ఉన్న కత్తితోనే అడ్డుకున్నాడు. ముగ్గురు యువకులు కత్తులు పట్టుకుని నడిరోడ్డుపై తలపడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలైనా, అఫ్సారీ అక్కడే కుప్పకూలాడు. వెనువెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఇక ఇబ్రహీం, సాధిక్ లకు కూడా ఈ ఘర్షణలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురు యువకులూ రౌడీ షీటర్ల కుటుంబాలకు చెందిన వారే. గొడవ నేపథ్యంలో ప్రస్తుతం బార్కస్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.