: ఉత్కంఠ పోరులో సఫారీలదే విజయం... రోహిత్ సెంచరీ వృథా!
ఉత్కంఠ అంటే ఎలా ఉంటుందో క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసినా, అసలైన ఉత్కంఠ అంటే ఎలా ఉంటుందో చూపింది నిన్నటి టీమిండియా, సఫారీల మధ్య జరిగిన టీ20 మ్యాచ్. ఫ్రీడం సిరీస్ లో భాగంగా నిన్న ధర్మశాలలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న సఫారీలనే విజయం వరించింది. కొత్తగా తెరంగేట్రం చేసిన ఫ్రీడం సిరీస్ ను సఫారీలు విజయంతో ప్రారంభిస్తే, ధోనీ సేన మాత్రం పరాజయంతో ఆరంభించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియాతో విజయం దోబూచులాడినా, ఛేజింగ్ లో సిసలైన దక్షిణాఫ్రికా జట్టునే వరించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (66 బంతుల్లో 106 పరుగులు) వీరవిహారం చేశాడు. తనదైన స్టైలిష్ బ్యాటింగ్ తో అతడు సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 62 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న అతడు టీమిండియాకు శుభారంభాన్నిచ్చాడు. ఇక తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్ (3) విఫలమైనా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (43) చెలరేగాడు. రోహిత్ తో కలిసి సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (14) మాంచి ఊపుమీదున్నట్లు కనిపించినా, త్వరలోనే పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (20) చివరిదాకా క్రీజులో నిలిచినా రైనా, రాయుడు(0)ల విఫలంతో పెద్దగా పరుగులేమీ రాబట్టలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇంకో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరం చేరింది. కేవలం మూడు వికెట్లను కోల్పోయిన ఆ జట్టు సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. హషీమ్ ఆమ్లా(36)తో కలిసి ఆ జట్టు బ్యాటింగ్ ను ప్రారంభించిన స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ (51) జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. తర్వాత కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ (4) విఫలమైనా, కొత్త ఆటగాడు ఫర్హాన్ బర్హదీన్ (32)తో కలిసి జేపీ డుమిని (34 బంతుల్లో 68 పరుగులు) వీర విహారం చేశాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి వరకూ క్రీజులో కొనసాగి జట్టుకు విజయాన్ని అందించిన డుమినికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.