: యజమాని ప్రాణాలు కాపాడి, తన ప్రాణాలు అర్పించిన వీర శునకం!
విశ్వాసానికి మారు పేరు శునకాలు అని కొత్తగా వాటి గురించి చెప్పక్కర్లేదు. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు చూశాము, విన్నాం. కాకపోతే, తన యజమాని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వీర శునకాలు అతి తక్కువగా ఉంటాయి. అటువంటి సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. పమేరియన్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఒకటి తన యజమానిని తాచుపాము బారి నుంచి రక్షించి అది బలైపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. టూటీకోరిన్ లో నివాసం ఉంటున్న ఒక మహిళ ఇంట్లోకి నిన్న రాత్రి ఒక తాచుపాము వెళ్లింది. ఆ మహిళ నిద్రిస్తున్న దగ్గరే తాచు పడగవిప్పి ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన పెంపుడు శునకం అదేపనిగా మొరగడం ప్రారంభించింది. అయినా వెనక్కి తగ్గని తాచు మహిళను కాటేయబోతున్న తరుణంలో ఆ శునకం ఒక్కసారిగా దాని మీదకు దూకి తన యజమాని ప్రాణాలు కాపాడింది. కానీ, ఆలోపే పాము కాటు శునకంపై పడింది. అయినప్పటికీ వెనకడుగు వేయని శునకం ఆ తాచు తలను కొరికిపారేసింది. ఈ అలికిడికి యజమానికి మెలకువ వచ్చింది. వెంటనే శునకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తన ప్రాణాలు కాపాడటం కోసం ప్రేమగా పెంచుకున్న శునకం బలైపోవడంతో యజమాని విలపించింది. ఆ వీర శునకానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ అంత్యక్రియల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు.