: గాంధీ జీవిత విశేషాలతో ప్రత్యేక మొబైల్ మ్యూజియం
మహాత్మా గాంధీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియజేసేందుకుగాను ప్రత్యేక మొబైల్ మ్యూజియంను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ప్రారంభించారు. అక్టోబర్ 2 మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయన స్వస్థలమైన పోరుబందర్ లో ఈ మొబైల్ మ్యూజియంను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక మొబైల్ మ్యూజియంలో ముఖ్యమైన గాంధీ ఫొటోలు, రాతప్రతులు, డాక్యుమెంటరీలు ఉన్నాయని చెప్పారు. ఒక ట్రక్కులాంటి వాహనంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ మ్యూజియంను భారత విదేశాంగశాఖ తీర్చిదిద్దింది. రేపటి నుంచి ప్రయాణం ప్రారంభించనున్న ప్రత్యేక మొబైల్ మ్యూజియం మొదటగా రాజ్ కోట్, అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లనుంది. గుజరాత్ లోన పలు నగరాల్లో పర్యటించిన అనంతరం రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చేరుతుంది. అక్కడి నుంచి అక్టోబర్ 26 నాటికి ఇది ఢిల్లీకి చేరుతుందని అధికారులు వివరించారు.