: గిరిజనుల సొత్తు అల్లుడికి దోచిపెట్టారు: వైఎస్ కుటుంబపై రేవంత్ ఫైర్
బయ్యారం గనులను రక్షణ స్టీల్స్ కు కేటాయించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. గిరిజనులకు చెందిన ఖనిజ సంపదను అల్లుడు 'బ్రదర్' అనిల్ కు దోచిపెట్టారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రదర్ అనిల్ తన బినామీల సాయంతో అక్కడ పరిశ్రమలు నెలకొల్పారని రేవంత్ వివరించారు. గనులతో తమకు సంబంధం లేదని చెబుతున్న వైఎస్ కుటుంబానికి.. బినామీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరే దమ్ముందా? అని రేవంత్ ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ బినామీ కొండల్ రావుకు రూ. 500 కోట్లతో పరిశ్రమ పెట్టే సత్తా లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, వైఎస్ హయాంలో బయ్యారం గనులపై ఇచ్చిన జీవోలో ఖమ్మం జిల్లాలో పరిశ్రమ పెట్టొచ్చని తొలుత పేర్కొన్నా.. కృష్ణా జిల్లాలో పరిశ్రమ పెట్టుకోవచ్చంటూ 24 గంటల్లోనే జీవో మార్చేశారని రేవంత్ ఆరోపించారు.