: బీహార్ లో ఎన్డీయే విజయం సాధిస్తుందనడానికి ఇదే తార్కాణం: మోదీ
బీహార్ లో ఎన్డీయే విజయం సాధిస్తుందని చెప్పడానికి ఈ బహిరంగ సభకు వచ్చిన జనాభాయే తార్కాణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంకాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ, బీహార్ కు ఉద్యోగాలు, అభివృద్ధి విధానం అవసరమని అన్నారు. వాటిని సాధించేందుకు ఎన్డీయేకు ఒక్క అవకాశమివ్వాలని ఆయన కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బీహార్ ను అభివృద్ధి చేసే సామర్థ్యముందని అన్నారు. బీహార్ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని, ఎన్డీయే అధికారంలోకి వస్తే అలాంటి అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. బీహార్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ సభలో ప్రధానితోపాటు రాంవిలాస్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ పాల్గొన్నారు.