: భారత్ లో ఐఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం... ధరలు రూ.62 వేల నుంచి 92 వేలు
భారత స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ సిరీస్ తాజా ఫోన్లు ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారత దేశంలో 300లకు పైగా స్టోర్లు ఉన్న ‘యూనివర్ సెల్’ తన అన్ని స్టోర్లలో నిన్న ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. నిన్న ఉదయం ప్రీ బుకింగ్ లను ప్రారంభించగా, సాయంత్రానికి 100కు పైగా ఆర్డర్లు వచ్చాయని ఆ సంస్థ ఎండీ సతీశ్ చంద్ర చెప్పారు. ఇక మరో మొబైల్ చైన్ స్టోర్ ‘సంగీతా మొబైల్స్’ కూడా ఐఫోన్ తాజా మోడళ్లకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను నిన్ననే ప్రారంభించింది. ఐఫోన్ తయారీ సంస్థ ‘యాపిల్’ నుంచి ధరలకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే ఈ సంస్థలు ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించాయి. ఇక ధరల విషయానికొస్తే ఐఫోన్ 6ఎస్ ధర రూ.62,000 ల నుంచి ప్రారంభమవుతుండగా, ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేసిక్ మోడల్ రూ.72,000 గా ఉంది. తాజా సిరీస్ హైఎండ్ మోడల్ (ఐఫోన్ 6ఎస్ ప్లస్ 128 జీబీ) ఖరీదు రూ.92,000గా ఉంది.