: తమిళనాడులో తెలుగు బోధన ఉద్యమంపై పవన్ ఎందుకు వెనక్కి తగ్గారో తెలియదు: దర్శకుడు తమ్మారెడ్డి
తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్యమం చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తరువాత దాని గురించిన ఊసేలేదు. తాజాగా దానిపై దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, పవన్ ఆ ఉద్యమంపై ఎందుకు వెనక్కి తగ్గారో తెలియడం లేదన్నారు. ఆయన గనుక ఆ ఉద్యమంలో పాల్గొంటే చైతన్యం వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన తమిళనాడు యువశక్తి సమావేశంలో తమ్మారెడ్డి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించకపోతే రక్తాక్షరాలతో ఉద్యమం చేపడతామని చెప్పారు. అలాగే తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలని ఉత్తరాల ఉద్యమం చేయబోతున్నట్టు కూడా తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు బోధన కొనసాగేలా చూడాలని కోరారు.