: వినాయకుడి ప్రసాదం కోసం వస్తే... లాఠీ దెబ్బలు తగిలాయి!
భారీ గణనాథుడిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగానూ ఖైరతాబాదు వినాయకుడికి పేరుంది. ఆ వినాయకుడి చేతిలోని ప్రసాదమంటే భక్తులకు అమిత ఇష్టం. అది కూడా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో తయారై వందల కిలో మీటర్ల మేర ప్రయాణించి హైదరాబాదుకు చేరుకుంటుంది మరి. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదులో ప్రారంభమైన వినాయకుడి ప్రసాదం పంపిణీలో గందరగోళం నెలకొంది. వినాయకుడి ప్రసాదం కోసం భక్తులు ఎగబడితే, వారిని నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. వినాయకుడి పవిత్ర ప్రసాదం కోసం వస్తే, ఈ లాఠీ దెబ్బలేమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే... ఖైరతాబాదు వినాయకుడి ప్రసాదం పంపిణీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. జంట నగరాల నుంచే కాక జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో నేటి తెల్లవారుజాము నుంచే ఖైరతాబాదులో జనసందోహం నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు హాజరవడంతో తమకు ప్రసాదం అందుతుందో, లేదోనన్న ఆందోళనతో కొంతమంది భక్తులు ముందుకు దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. వెనువెంటనే స్పందించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.