: కన్నడ ఖాకీలకు చిక్కిన తెలంగాణ పోలీస్ రివాల్వర్... పెన్ పహాడ్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఆలయానికి వెళ్లిన ఆ పోలీసు అధికారి ఇష్ట దైవానికి ఘనంగానే మొక్కులు చెల్లించుకున్నాడు. అయితే తన విద్యుక్త ధర్మాన్ని మాత్రం మరిచాడు. ఆలయం వెలుపల పార్కు చేసిన వాహనంపై తన సర్వీస్ రివాల్వర్ ఉంచి దేవత మొక్కు తీర్చుకున్నాడు. ఆ రివాల్వర్ కాస్తా పొరుగు రాష్ట్ర పోలీసులకు చిక్కింది. అయితే ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో రివాల్వరైతే ఆయన వద్దకు వచ్చింది కాని ఉద్యోగమే తాత్కాలికంగా ఊడింది. వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లా పెన్ పహాడ్ ఎస్సైగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి గత నెల 29న కర్ణాటక సరిహద్దులోని మైసమ్మ ఆలయానికి వెళ్లాడు. బయట పార్కు చేసిన తన వాహనంపై రివాల్వర్ ఉంచి ఆలయం లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి భక్తులు రివాల్వర్ చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెనువెంటనే రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అది పోలీస్ సర్వీస్ రివాల్వరేనని నిర్ధారించుకుని తిరిగి శంకర్ రెడ్డికి ఇచ్చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన శంకర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రం జిత్ దుగ్గల్ రివాల్వర్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన శంకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.