: ప్రజాస్వామ్యమా? దౌర్జన్యస్వామ్యమా?: ఉత్తరప్రదేశ్ ఘటనపై ఒవైసీ ఆగ్రహం


ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘటన గురించి విని ఆశ్చర్యపోయానని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ గోవును చంపితే ఇలా శిక్షిస్తారా? అని నిలదీశారు. 'ఇక్కడ ఎవరికీ స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ, దౌర్జన్యస్వామ్యంగా మారుస్తున్నారు' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ను హిందూత్వ దేశంగా మార్చాలని సంఘ్ పరివార్ భావిస్తే అది మరింత బలహీనమవుతుందని ఆయన హెచ్చరించారు. హత్యకు గురైన వ్యక్తి కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సేవలందిస్తున్నాడన్న విషయం గుర్తించాలని ఆయన సూచించారు. గోమాంసం తిన్నంత మాత్రాన మనుషుల్ని చంపాలని ఆదేశిస్తే, ఇక చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసులు ఎందుకు? వాటినన్నింటినీ మూసేయొచ్చుకదా? అని ఆయన సూటిగా అడిగారు. అలాగే కేంద్ర మంత్రి మహేష్ శర్మ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మూక వెళ్లి, వ్యక్తిని ఇంట్లోంచి లాక్కొచ్చి హత్య చేస్తే, దానిని 'తప్పిదం' అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. బాధితులకు 10 లక్షల రూపాయల పరిహారం అందజేసిన ప్రభుత్వం, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుందని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News