: సమ్మె విరమించుకోకుంటే ఎస్మా ప్రయోగిస్తాం: అచ్చెన్నాయుడు వార్నింగ్
రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు బంకులు సమ్మె చేపట్టడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పెట్రోలు బంకులు నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్నాయని మండిపడ్డారు. తక్షణం సమ్మె విరమించని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పెట్రోలు బంకుల యాజమాన్యాలు, లారీ ఓనర్స్ కోర్కెలు తీర్చిన తరువాత కూడా సమ్మె చేపట్టడం సరికాదని ఆయన తెలిపారు. వ్యాట్ గురించి పెట్రోలు బంకుల యాజమాన్యాలు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వ్యాట్ కడుతున్నారు, దానినే పెట్రోలు బంకుల యజమానులు ప్రభుత్వానికి కడుతున్నారని ఆయన అన్నారు. ఇందులో పెట్రోలు బంకుల యాజమాన్యాలు ఎందుకు జోక్యం చెసుకుంటున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. పెట్రోలు బంకుల యాజమాన్యాలు మొండికేస్తే, వారిని దారికి తెచ్చేందుకు ఎస్మా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం ఆయా బంకులకు పెట్రోలు సరఫరా చేసే కంపెనీలతో మాట్లాడుతామని ఆయన వెల్లడించారు. వ్యాట్ తగ్గించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే విదేశీ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రితో మాట్లాడుతామని ఆయన చెప్పారు.