: వాళ్ల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం సుమా!
సాంకేతి విప్లవం నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో సాయపడుతోంది. బ్రిటన్ లో నిఘా విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పేందుకు ఛానెల్ 4 నిర్వహించిన ఓ రియాలిటీ షో ఎంతో ఉపయోగపడింది. ఈ రియాలిటీ షో లో పాల్గొనేందుకు 14 మంది సామాన్యులను ఎంపిక చేశారు. లండన్ టెర్రరిస్టు నిరోధక విభాగం మాజీ అధిపతి, సీఐఏ విశ్లేషకుడు, నిఘా నిపుణులతో కూడిన 30 మంది సభ్యులతో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఆ 14 మంది సామాన్యుల ఫోటోలు ఇచ్చింది. ఆ 14 మందిని దేశంలోని ఎక్కడికైనా పారిపోయి దాక్కోమని చెప్పింది. అలా 28 రోజుల పాటు ఎవరికీ దొరకకుండా దాక్కోగలిగినవారే విజేతగా నిలుస్తారని ప్రకటించింది. వారి దారి ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చింది. అయితే, కేవలం రెండు వారాల్లోనే 13 మందిని నిఘా బృందం పట్టేసింది. కానీ 46 ఏళ్ల జీపీ రీకీ అలెన్ మాత్రం మూడో వారం వరకు నిఘా బృందాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పలుమార్లు అతని దగ్గరగా వెళ్లిన నిఘా బృందం సభ్యుల కళ్ళు కప్పగలిగాడు. దీంతో 28 రోజుల పాటు తప్పించుకోలేకపోయినప్పటికీ చివరికి అతనినే విజేతగా ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ది 39 స్టెప్స్' అనే అడ్వెంచరస్ నవల తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందని, తన ఇంట్లో ఉన్న ఆ నవలను వీరెవరైనా చదివి ఉంటే తాను ఎప్పుడో దొరికేసేవాడినని పేర్కొన్నారు. నిఘా నీడన నిజాయతీగా బతకాల్సిందేనని, అలా లేకుంటే పట్టుబడి తీరాల్సిందేనని నిరూపించేందుకు ఈ షోలో పాల్గొన్నానని చెప్పాడు. కాగా, బ్రిటన్ లో ప్రతి 11 మందికి ఒకటి చొప్పున సీసీ కెమెరాలు వీధుల్లో అమర్చారు. వాటిలో ప్రతి నెంబర్ ప్లేటును ఆటోమేటిక్ గా గుర్తించగలిగే 8వేల కెమెరాలు ఉన్నాయి. ఇవి కోటీ నలభై లక్షల మంది ప్రజలపై నిఘా వేయగలవు. అలాగే మూడున్నర కోట్ల మంది ప్రజల ఫోన్లను ట్రాక్ చేయగల జీపీఎస్ వ్యవస్థ లండన్ నిఘా విభాగాల సొంతం. వాటిని వినియోగించుకునే సౌలభ్యం ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఉండదు కనుక ప్రభుత్వ కెమెరాల వద్ద సొంత కెమెరాలు, మ్యాపింగ్ వ్యవస్థను ఉపయోగించి వారిని పట్టేసినట్టు ఛానెల్ 4 తెలిపింది.