: ఎయిర్ టెల్ 'జీవితాంతం ఉచిత మొబైల్ బిల్లు' యాడ్ కి బ్రేక్!


నాలుగో తరం తరంగాల పనితీరును తెలియజేస్తూ, "ఎయిర్ టెల్ 4జీ ఎప్పుడైనా, ఎక్కడైనా వేగవంతమైన నెట్ వర్క్. ఒకవేళ మీ నెట్ వర్క్ ఇంతకన్నా వేగంగా ఉంటే, మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తాం" అంటూ ప్రసారమవుతున్న వ్యాపార ప్రకటనను ఎయిర్ టెల్ ఉపసంహరించుకోనుంది. ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రకటనల ప్రమాణాల విభాగం (ఏఎస్ సీఐ) నుంచి ఎయిర్ టెల్ కు నోటీసులు వెళ్లాయి. తక్షణమే ఈ యాడ్  ప్రసారాన్ని నిలిపివేయాలని ఏఎస్ సీఐ ఆదేశించింది. ఈ ప్రకటనను సమీక్షించిన ఏఎస్ సీఐ, ఇది కోడ్ చాప్టర్ 1.4ను అతిక్రమించినట్టు అభిప్రాయపడింది. దీంతో పాటు వాస్తవాలను వక్రీకరించేలా ఉందని పేర్కొంది. తమ 4జీ సేవలే దేశంలో బెస్ట్ అనడానికి ఆ సంస్థ ఆధారాలు చూపడంలో విఫలమైందని పేర్కొంది. ఓ వినియోగాదారుడు చేసిన ఫిర్యాదుతో ఏఎస్ సీఐ ఈ విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. తమకు ఆదేశాలు అందగానే ఈ ప్రకటనను నిలిపివేస్తామని ఎయిర్ టెల్ వెల్లడించింది. అంతకన్నా ముందు తమ వద్ద ఉన్న సాంకేతిక గణాంకాలను, 4జీ తరంగాల వేగాన్ని ఏఎస్ సీఐ ముందుంచి వారిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News