: జైట్లీని పక్కన పెట్టారా?... ఆయనే దూరంగా ఉన్నారా?
దేశ వ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్న అంశం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. అక్కడి ప్రజలు ఏ రాజకీయ పార్టీకి అధికారం కట్టబెడతారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. జనతాపరివార్ కూటమి, ఎన్డీయే కూటమి ఢీ అంటే ఢీ అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. అయితే, 2005, 2010 సంవత్సరాలలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకుని పార్టీని విజయపథాన నడిపించిన నేత భారతీయ జనతా పార్టీ సీనియర్ అరుణ్ జైట్లీ. మరి, ఈ సారి ఏమైంది? ప్రచార సభలలో ఆయన ఎక్కడా కనబడట్లేదు. జైట్లీ తనంతట తానే ప్రచార బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడలేదా? లేక పార్టీ పక్కన పెట్టిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలే బీహార్ ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. వారికి సీనియర్ నాయకులు సహకరిస్తున్నారు. బీహార్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో అన్నీ తానై నడిపించిన అరుణ్ జైట్లీని ఈ సారి పక్కనపెట్టడానికి కారణం... ఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురవడమే అనే టాక్ కూడా వుంది. ఈ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా నాడు జైట్లీనే నిర్వహించారు. కానీ, ఘోరంగా బీజేపీ విఫలమైంది. దీంతో బీజేపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే.. ఆయన్ని బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచినట్లు సమాచారం.