: హిందూమతానికి ఓ పవిత్ర గ్రంథం సృష్టించే యత్నం... వీహెచ్ పీ కసరత్తు
ఇస్లాం మతానికి ఖురాన్, క్రైస్తవ మతానికి బైబిల్ పేరిట ఆయా మతాలకు ఒకే ఒక మత గ్రంథం ఉంది. అదేవిధంగా హిందూమతానికి కూడా ఒక పవిత్ర గ్రంథాన్ని సృష్టించాలన్న ఆలోచనలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ అందుకోసం కసరత్తులు ప్రారంభించింది. ఏకరీతి ఆధ్యాత్మిక విలువలు ఉండాలనే ఉద్దేశంతో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన మేరకు ఈ గ్రంథం రూపకల్పన పనిలో మునిగిపోయామని వీహెచ్ పీ ఉపాధ్యక్షుడు జీవేశ్వర్ మిశ్రా తెలిపారు. ఇటీవల ఒక స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ఉపనిషత్తులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటి నుంచి హిందువులు తప్పక ఆచరించాల్సిన అంశాలను తీసుకుని ఒక పవిత్ర గ్రంథాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈ గ్రంథం రూపకల్పన యజ్ఞంలో మిశ్రాతో పాటు మరికొందరు ఉన్నారు.