: ముగిసిన 'నైరుతి'... 2009 తరువాత వరస్ట్!
ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాల సీజన్ ముగిసింది. 2009 తరువాత అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సీజనులోనేనని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువ వర్షాలు కురిశాయని, దేశవ్యాప్తంగా 30 శాతం భూభాగంలో కరవు తాండవిస్తోందని వెల్లడించింది. నైరుతీ సీజన్ కొనసాగే జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య 760.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సగటున 887.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి వుందని తెలిపింది. ఈ విషయాన్ని తాము ముందే గమనించామని, సాధారణం కన్నా 12 శాతం తక్కువ వర్షాలు కురుస్తాయని భావించగా, మరో రెండు శాతం మేరకు లోటు పెరిగిందని వివరించింది. కాగా, సాంకేతికంగా నైరుతీ సీజన్ ముగిసినప్పటికీ, మరో వారం పది రోజుల పాటు ఆ ప్రభావం వుంటుందని అయితే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రం సీజన్ ముగిసినట్టేనని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయవ్య ప్రాంతాన 17 శాతం, కేంద్ర భారతావనిలో 16 శాతం, దక్షిణాదిన 15 శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 8 శాతం తక్కువ వర్షాలు కురిశాయని తెలిపారు.