: తెలంగాణ బాలుడిని రక్షించిన ఆంధ్రా పోలీసులు
అవును, కిడ్నాపర్ల బారిన పడ్డ తెలంగాణ బాలుడిని ఆంధ్రా పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ల వెన్నులో వణుకు పుట్టించిన ఆంధ్రా పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి అధీనంలోని తెలంగాణ బాలుడిని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకెళితే... తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన సుమన్ నాయక్ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాలుడిని తీసుకుని నలుగురు సభ్యుల కిడ్నాపర్ల ముఠా తెలంగాణ సరిహద్దులు దాటి ఏపీలోని ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద కిడ్నాపర్ల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించారు. తమను చూసి పరుగులు పెట్టిన కిడ్నాపర్లను ఎట్టకేలకు పోలీసులు ఛేజ్ చేశారు. వారి చెరలోని బాలుడికి విముక్తి కల్పించిన పోలీసులు ముఠాలోని ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసింది. పరారైన మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం ప్రకాశం జిల్లా పోలీసులు జల్లెడ పడుతున్నారు.