: నిర్భయ నిందితుడిని ఉగ్రవాదంవైపు లాగుతున్నారు: నిఘా వర్గాల హెచ్చరిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో దోషిగా శిక్షను అనుభవిస్తున్న మైనర్ బాలుడిని ఉగ్రవాదంవైపు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం మజ్నూ కా తిలాలోని జైవైనల్ హోంలో శిక్షను అనుభవిస్తున్న ఇతడి మనసు మార్చేందుకు 2011 ఢిల్లీ హైకోర్టు పేలుడు కేసులో దోషిగా శిక్షననుభవిస్తున్న ఓ మైనర్ ప్రయత్నించాడని హెచ్చరించాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 21న నిర్భయ దోషి జైలు నుంచి బయటకు రానున్నాడని, అతనితో బాంబు పేలుళ్ల కేసులో భాగమున్న మరో బాలుడు నిత్యమూ మాట్లాడుతున్నాడని తమకు తెలిసిందని, విషయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డు, కేంద్ర హోం శాఖకు తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం వీరిద్దరినీ రెండు వేర్వేరు గదుల్లో ఉంచి కలవకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. నేరాలు జరిగినప్పుడు మైనర్లుగా ఉన్న వీరిద్దరి వయసూ ఇప్పుడు 20 ఏళ్లు. ఈ ఇద్దరి చర్యలనూ నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు.