: అక్బరుద్దీన్ తో కేటీఆర్ భేటీ... అసెంబ్లీ వాగ్వాదం తర్వాత భేటీపై సర్వత్ర ఆసక్తి


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్), ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీల మధ్య మొన్న అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పిట్ట కథ చెప్పిన అక్బరుద్దీన్ పై కేటీఆర్ అంతెత్తున ఎగిరిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై తాము సీరియస్ గానే ఉన్నామని చెప్పిన కేటీఆర్, పిట్ట కధలు కాకుండా అసలు విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాలన్న రీతిలో అక్బరుద్దీన్ కు కౌంటరిచ్చారు. ఆ తర్వాత సర్కారు తమనేమీ నియంత్రించలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎదో తేడా వచ్చిందన్న గుసగుసలు వినిపించాయి. అయితే నేటి ఉదయం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మజ్లిస్ ఎల్పీ కార్యాలయంలో ఉన్న అక్బరుద్దీన్ వద్దకు కేటీఆర్ వెళ్లారు. తన వద్దకు వచ్చిన కేటీఆర్ తో అక్బరుద్దీన్ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జుట్లు పట్టుకున్న చందాన వాదులాడుకున్న వీరిద్దరి మధ్య రెండు రోజులు గడిచాయో, లేదో భేటీ జరగడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News