: ఆధిపత్యం కోసం ఏకమవుతున్న అంబానీలు!
భారత టెలికం రంగంలో అగ్రస్థానంలో నిలవాలన్న ఏకైక లక్ష్యంతో పారిశ్రామిక దిగ్గజాల సోదర ద్వయం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు చేతులు కలపనున్నారు. ఈ విషయాన్ని అనిల్ అంబానీ స్వయంగా వెల్లడిస్తూ, రిలయన్స్ జియోతో తమ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) చర్చలు జరుపుతోందని, ఇండియన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 4జీ సేవల విషయంలోనూ, స్పెక్ట్రమ్ షేరింగ్ అంశాలపైన ఈ చర్చలు జరుగుతున్నాయని వివరించారు. చాలా రోజుల తరువాత తన అన్న ముఖేష్ అంబానీని నలుగురి ముందూ తలచుకున్న అనిల్ అంబానీ, తన అన్న ఎంతో ఆదర్శనీయుడని, ఆయన తనకిచ్చిన మద్దతు, మార్గదర్శనం మరువలేనివనీ పొగడ్తలతో ముంచెత్తారు. జాతీయ స్థాయి స్పెక్ట్రమ్ ట్రేడింగ్, షేరింగ్ ఒప్పందం విషయంలో త్వరలోనే తుది నిర్ణయానికి రానున్నట్టు వివరించారు. ఈ డీల్ తో ఆర్ కామ్ వినియోగదారులకు 4జీ సేవలు దగ్గరవుతాయని, తమ అన్ని సర్కిళ్లలోని టవర్లనూ రిలయన్స్ జియో వాడుకోవచ్చని, ఇది భారత టెలికం రంగం దిశను మార్చివేసే పరిణామమని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. కాగా, రిలయన్స్ సామ్రాజ్యాన్ని 2005లో అన్నదమ్ములిద్దరూ పంచుకున్న తరువాత కొంతకాలం ఎడమొహం పెడమొహంగా ఉన్నా, తల్లి చొరవతో సంధి కుదుర్చుకుని దగ్గరైన సంగతి తెలిసిందే. అడాగ్ (అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్) సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన అనిల్ అంబానీ, తాము కమొడిటీ ఎక్స్ఛేంజీ ప్లాట్‌ఫాం ఐసెక్స్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నామని, రూ. 6500 కోట్లతో విమాన సామగ్రి తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని వాటాదారులకు వివరించారు. ఈ సంవత్సరంలోనే పిపవావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ కంపెనీని విలీనం చేసుకుంటామని, ఆపై ఆ సంస్థకు రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ గా పేరు మార్చి బెంగళూరులో ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ కోసం టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.