: పోలీసులు ప్రశ్నిస్తుంటే బోరున విలపించిన ఆప్ నేత సోమనాధ్ భారతి
తన భార్యను ఎలా చిత్ర హింసలు పెట్టారు, ఆమెను చంపాలని ఎలా కుట్రలు చేశారన్న విషయంలో పోలీసులు ఒక్కో ప్రశ్నా అడుగుతుంటే, ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాధ్ భారతి బోరున విలపించారట. సోమనాధ్ భారతి భార్య లిపికా మిత్రాను కూడా విచారణకు పిలిపించిన పోలీసులు, ఆమె ఎదుటే ఆయనను ఇంటరాగేట్ చేశారు. తన పెంపుడు కుక్కను ఆమెపై ఎలా ఉసిగొల్పిందీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రశ్నలకు ఆయన తాళలేక కన్నీరు పెట్టుకున్నారని ఓ అధికారి తెలిపారు. విచారణలో భాగంగా ఆయన నివాసం ఉంటున్న ద్వారకా రెసిడెన్స్ కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడ పదులకొద్దీ ప్రశ్నలను ఆయనపై సంధించారు. లిపికా ఎదుట దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు. కాగా, సోమనాథ్ పై ఐపీసీ సెక్షన్ 212 (తప్పించుకు తిరగడం)ను కొత్తగా పెట్టామని పోలీసులు తెలిపారు. ఆయన తప్పించుకుని తిరిగిన సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆశ్రయం ఇచ్చారని, వారందరిపైనా కేసులు పెట్టనున్నామని తెలిపారు. ఆ ఇళ్లకు ఆయన్ను తీసుకు వెళ్లాల్సి వున్నందున కస్టడీని మరికొంత కాలం పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్టు తెలిపారు.