: ఐఫోన్ తాజా మోడల్ ఇప్పుడే కావాలా?...అయితే డబుల్ రేట్ అమౌంట్ సిద్ధం చేసుకోండి!


యాపిల్ ఉత్పత్తులంటేనే వాటి కేటరిగీలో కాస్తంత అధిక ధరే. అదే వాటి కోసం డబుల్ రేటు పెట్టాల్సి వస్తే? అయినా ఫరవా లేదనే భారతీయులున్నారు. లేకపోతే ఈ-బే, ఓఎల్ఎక్స్, క్వికర్ లాంటి ఈ-కామర్స్ సైట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ ఎందుకు విక్రయిస్తాయి చెప్పండి? అసలు విషయమేంటంటే... యాపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్ లో తాజాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ లను గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోనే ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ మార్కెట్లోకి మాత్రం ఈ నెల 16న ఎంట్రీ ఇవ్వనున్నాయి. 16న మార్కెట్లోకి వచ్చే ఫోన్లు వినియోగదారుల చేతిలోకి వచ్చేసరికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకించి ఐఫోన్ సిరీస్ ఫోన్లంటే వేలం వెర్రిగా తరలివచ్చే వినియోగదారులను ఆసరా చేసుకుని ఈ-బే, ఓఎల్ఎక్స్, క్వికర్ లు అప్పుడే రంగంలోకి దిగేశాయి. ఇంపోర్టెడ్ ఐఫోన్ 6ఎస్ మోడల్ ఫోన్లు అందిస్తామంటూ ఆ సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే రేటు మాత్రం రెట్టింపవుతుందని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్ బేసిక్ మోడల్ ధర రూ.55 వేల నుంచి 56 వేల దాకా ఉంటే, 6ఎస్ ప్లస్ బేసిక్ మోడల్ ధర రూ.65 వేల నుంచి 66 వేల దాకా ఉంది. ఇఫ్పటికిప్పుడు 128 జీబీ మెమరీ సామర్థ్యమున్న 6ఎస్ ప్లస్ మోడల్ కావాలంటే ఏకంగా రూ.1,14,999 చెల్లించాలని ఈ-బే చెబుతోంది. ఇంత రేటు పెట్టి కొన్నా, ఆరు నెలల విక్రయదారుడి గ్యారెంటీ మాత్రమే ఉంటుందట. అయినా ఇండియన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వీటికోసం ఎగబడుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News