: ఉద్యోగమిప్పిస్తామని చెప్పి.. బార్ లో డ్యాన్సులు చేయించారు: నేపాలీ అమ్మాయి


ఈ ఏడాది ఏప్రిల్ లో నేపాల్ ను అతలాకుతలం చేసి, వేలమందిని పొట్టనపెట్టుకున్న భూకంప విలయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ విపత్తులోనే తన చిన్న ఇంటిని పోగొట్టుకున్న ఒక యువతి, ఉద్యోగం మాయలో పడి ఒక ఏజెంట్ వలలో చిక్కుకుని దుర్భర జీవితం అనుభవించింది. నేపాల్ రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుపాల్ చౌక్ అనిత స్వగ్రామం. ఆ గ్రామంలో ఆమెకు సొంత ఇల్లు ఒకటుంది. అనారోగ్యవంతురాలైన తల్లి, ఒక సోదరుడితో పాటు అనిత అక్కడే నివసించేది. వాళ్ల పోషణ బాధ్యత అనితదే. ఈ ఏడాదిలో సంభవించిన భూకంపానికి ఆ ఇల్లు కూలిపోయింది. దీంతో వారు రోడ్డున పడ్డారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడింది ఆ కుటుంబం. ఈ క్రమంలో అనితకు ఒక ఏజెంట్ తో పరిచయమైంది. ఖాట్మండ్ లో ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగమిప్పిస్తానని చెప్పి అనితను అక్కడికి తీసుకెళ్లాడు. ఇక అసలు కథ, ఇక్కడే మొదలైంది. ఏజెంట్ చెప్పిన ఉద్యోగానికి బదులుగా బార్ లో డ్యాన్స్ లు చేయాలని చెప్పాడు. మొదట కస్టమర్లకు డ్రింక్ సర్వ్ చేయమన్నాడు. క్రమంగా డ్యాన్స్ చేయమంటూ ఆమెను బలవంతపెట్టి ఆ రొంపిలోకి దింపాడు. బార్ లో కస్టమర్ల ముందు బాలీవుడ్ పాటలకు అనిత డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఏడుగంటలపాటు డ్యాన్స్ చేయించే వారు. రెండు నెలల పాటు ప్రతిరోజూ ఆమె డ్యాన్స్ లు చేసింది. ఒకవేళ ఆరోగ్యం బాగుండక రాలేనని నిర్వాహకులకు చెప్పినా ఫలితం ఉండేది కాదు. కొన్ని సందర్బాలలో గూండాలతో బెదిరించేవారు. ఈ రొంపి నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ప్రతిసారి బార్ మేనేజర్ అడ్డు తగిలేవాడు. ‘బార్ కు వచ్చే కస్టమర్లు నన్ను నానా హింసలు పెట్టేవారు. వారి ఇష్టానుసారం నన్ను ముట్టుకునేవారు. వాళ్లలో ఎక్కువ మంది నేపాలీ వాళ్లు ఉండేవారు. భారత్ నుంచి వచ్చిన, ఇతర దేశాల పర్యాటకులు కూడా ఉండేవారు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును తన ఇంటికి పంపుతూ ఉండేదాన్ని’ అని అనిత పేర్కొంది. ఎట్టకేలకు, మహిళల అక్రమ రవాణాను వ్యతిరేకించే ఒక ఎన్జీవో సంస్థకు చెందిన ఒక ప్రతినిధి ద్వారా అనితకు అభయ హస్తం లభించింది. ఇక్కడి నుంచి అతని ద్వారా బయట పడ్డానని బాధితురాలు చెప్పింది. అనిత లాంటి వాళ్లు ఇంకా చాలా మంది నేపాల్ లో ఉన్నారు. అక్కడి బార్లలో, నైట్ క్లబ్ లలో మగ్గుతూ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆ ఎన్జీవో సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News