: గవర్నర్ ను నిన్న పొగిడి...నేడు తెగిడిన కేజ్రీవాల్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చాలా మంచి వ్యక్తని పొగిడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు అదే నోటితో ఆయనను విమర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి ఏజెంటులా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను ఆయనే ప్రకటించేశారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ కాకుండా వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అధికారులపై సీబీఐ వంటి సంస్థలను ప్రయోగించి వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు సంబంధించిన పనుల్లో కేంద్రం కలుగజేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలాగే కొనసాగితే కేంద్రం, రాష్ట్రాల మధ్య అంతరం ఏర్పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.