: మా ప్రభుత్వానివి అన్నీ రికార్డులే: చంద్రబాబు


ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో రికార్డులను సృష్టించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించకపోయినప్పటికీ, రైతులకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో 5 నెలలా 20 రోజుల్లో పూర్తి చేసి రికార్డును సృష్టించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని కృష్ణాకు మళ్లించి, హంద్రీనీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులకు 100 టీఎంసీల నీటిని తీసుకెళ్లి మరో రికార్డును సృష్టిస్తామన్నారు. అక్టోబర్ 22న దసరా పర్వదినం నాడు రాజధాని శంకుస్థాపనకు పలు దేశాల అధినేతలు హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునేలా నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు మంచి రోజులు రానున్నాయని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని చంద్రబాబు కోరారు. జిల్లాలో రూ. 500 కోట్లతో బీఈఎల్ (బెల్) పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రైతు రుణాల మాఫీ కోసం ఎవరూ ఇవ్వనంత నిధులను ఇస్తున్నామని వెల్లడించిన ఆయన, అనంత వాసుల జీవితాల్లో కరవు లేకుండా చేస్తామని తెలిపారు. రూ. 200 కోట్లతో వ్యవసాయ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టామని, రైతులకు 50 శాతం రాయితీపై ట్రాక్టర్లను అందిస్తున్నామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News