: దూసుకెళ్లింది... రూ. 1.61 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద


భారత ఆర్థిక వృద్ధి మరింతగా పెరుగుతుందన్న అంచనాలకు తోడు, ఆసియా మార్కెట్ల లాభాలు కలసి రావడంతో సెన్సెక్స్ దూసుకెళ్లింది. అంతర్జాతీయ అంశాలతో పాటు మంగళవారం నాటి పరపతి సమీక్ష నిర్ణయాలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచగా, సెషన్ ఆరంభం నుంచి ఏ దశలోనూ సూచికలు వెనుదిరిగి చూడలేదు. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి రూ. 94,87,425 కోట్ల వద్ద ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ బుధవారం నాడు రూ. 96,48,764 కోట్లకు చేరింది. దీంతో, ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1.61 లక్షల కోట్లకు పైగా పెరిగినట్లయింది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 376.17 పాయింట్లు పెరిగి 1.46 శాతం లాభంతో 26,154.83 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 105.60 పాయింట్లు పెరిగి 1.35 శాతం లాభంతో 7,948.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.71 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 1.07 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈ-50లో కెయిర్న్ ఇండియా, ఐడియా, టాటా స్టీల్ కంపెనీల ఈక్విటీలు 6 శాతానికి పైగా పెరుగగా, గెయిల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీలు నష్టపోయాయి. ఆర్బీఐ తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం బ్యాంకుల మార్జిన్లపై ప్రభావం చూపనుందన్న అంచనాలతో బ్యాంకెక్స్ ఒత్తిడిలో పడింది. దాదాపు అన్ని బ్యాంకుల ఈక్విటీలూ నష్టపోయాయి.

  • Loading...

More Telugu News